WTC
Audio:
Drama
  • Drama
  • Non-Drama
Text Size

పరమ గీతము 7 - Telugu - 1992 WBTC Edition - Bible.is - TCWWTC

  1  రాకుమారీ, ఆ పాదరక్షల్లో నీ పాదాలెంతో అందంగా ఉన్నాయి నీ తొడల వంపులు శిల్పి మలిచిన ఆభరణాల్ల ఉన్నాయి.   2  నీ నాభి గుండ్రటి కలశంలా ఉంది దానికెన్నడూ ద్రాక్షారసం కొరత లేకుండుగాక. నీ ఉదరం పద్మ వలయితమైన గోధుమ రాశిలా ఉంది.   3  నీ స్తనాలు లేజవరాలైన జింక అప్పుడే కన్న కవల పిల్లల్లా ఉన్నాయి.   4  నీ మెడ దంతపు గోపురంలా ఉంది నీ నేత్రాలు బాత్ రబ్బీన్ సరసన ఉన్న హెష్బోనులోని తటా కాల్లా ఉన్నాయి. నీ నాసిక దమస్కు దిక్కుకి చూచే లెబానోను శిఖరంలా ఉంది.   5  నీ తల కర్మెలు పర్వతంలా, నీ తల నీలాలు పట్టుకుచ్చుల్లా వున్నాయి. నీ సుదీర్ఘ కేశాలు చూసిన రాజు కూడా నీ వశం అవుతాడు.   6  నీవు అతిలోక సుందరివి! అత్యంత మనోహరివి! ప్రియదర్శినివి! అందమైన, ఆహ్లాదకరమైన యువతివి!   7  నీవు తాళవృక్షంలా పొడుగరివి. నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి.   8  నాకు ఆ చెట్టుపైకి ఎక్కాలని, దాని మట్టలు పట్టాలని ఉంది. నీ స్తనాలు ద్రాక్షా గుత్తుల్లా నీ ఊపిరి ఆపిలు సువాసనలా ఉన్నాయి.   9  నీ నోరు శ్రేష్టమైన ద్రాక్షారసంలా అది నీ నోట జాలువారి నిద్రాముద్రిత ప్రియుని అధరాలను స్పృజించే మధువులా ఉండాలి.   10  నేను నా ప్రియునిదానను నన్నతను వాంఛిస్తాడు!   11  ఓ నా ప్రియుడా రా, చేలల్లోకి పోదాము రా, పల్లెల్లో రేయి గడుపుదాము రా,   12  పెందలకడ లేచి ద్రాక్షాతోటలకు పోదాము ద్రాక్షా తీగలు మొగ్గ తొడిగాయో లేదో ఆ మొగ్గలు విచ్చుకున్నాయో లేదో దానిమ్మ చెట్లు విరబూశాయో లేదో తనివితీరా చూద్దాము. రా. అక్కడ నేనిచ్చునా ప్రేమ అందుకొన రా.   13  ప్రేమ వర్ధక మండ్రేక ఓషధుల్నీ మా గుమ్మాన వేలాడే పరిమళభరితమైన పువ్వుల్నీ చూడు! ఓ నా ప్రియుడా, నీకై దాచి ఉంచాను ఎన్నెన్నో పండువీ, దోరవీ పండ్లు తిని చూడు!