కీర్తనలు 79

1దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు. ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని ఆపవిత్రపరచి నాశనం చేసారు. యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు. 2అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు. అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు. 3దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు. మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువ బడలేదు. 4మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి. మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు. 5దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా? బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా? 6దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము. నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము. 7ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి. వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు. 8దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము. త్వరపడి. నీ దయ మాకు చూపించుము. నీవు మాకు ఎంతో అవసరం. 9మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము. నీ స్వంత నామానికి నీవు మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము. మమ్మల్ని రక్షించుము. నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము. 10“మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?” అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు. దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము. నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము. 11దయచేసి, ఖైదీల మూల్గులు వినుము! దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము. 12దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము. ఆ ప్రజలు నిన్ను అవమానించిని సమయాలనుబట్టి వారిని శిక్షించుము. 13మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం. మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము. దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.

will be added

X\