1 పెద్ద మనిషి, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు? 2 వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు. నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది. 3 మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం. 4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడతుంది. 5 అందచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు. 6 మంచి వాళ్లు ఇది చూచి, దేవునిని గౌరవిస్తారు. వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు, 7 “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి. ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.” 8 అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను. నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను. 9 దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను. నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.