సామెతలు 20

1ద్రాక్షారసం నిన్ను ధైర్యవంతునిగా చేస్తుంది. మద్యము కొట్లాటలు పుట్టిస్తుంది. విపరీతమైన తాగుబోతు బుద్ధిహీనుడు. 2ఒక రాజు కోపం సింహగర్జనలా ఉంటుంది. నీవు రాజుకు కోపం పుట్టిస్తే నీ ప్రాణం పోగొట్టుకుంటావు. 3ఏ బుద్ధిహీనుడైనా ఒక వివాదం మొదలు పెట్టగలడు. కనుక వివాదాలకు దూరంగా ఉండే మనిషిని గౌరవించాల్సిందే. 4సోమరి మనిషికి విత్తనాలు చల్లటానికి కూడా బద్ధకమే. అందుచేత కోత సమయంలో అతడు భోజనం కోసం చూస్తాడు, కాని ఏమీ దొరకదు. 5ఒక మనిషి ఆలోచనలను నీవు చూడలేవు. అవి లోతైన నీళ్లలాంటివి. అయితే జ్ఞానముగలవాడు, ఒకరు ఏమి తలస్తున్నారో గ్రహించగలడు. 6చాలామంది మనుష్యులు నమ్మకంగా ఉన్నామని, నిండు ప్రేమతో ఉన్నామని చెబుతారు, కాని నిజంగా అలా ఉన్నవారిని కనుగొనడం చాలా కష్టం. 7ఒక మంచి మనిషి మంచి జీవితం జీవిస్తాడు. మరియు అతని పిల్లలు ఆశీర్వదించబడతారు. 8రాజు కూర్చొని ప్రజలకు తీర్పు చెప్పేటప్పుడు దుర్మార్గాన్ని ఆయన స్వంత కళ్లతో చూడగలడు. 9ఒక మనిషి ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దానినే చేస్తానని నిజంగా చెప్పగలడా? తనలో పాపం లేదని ఎవరైనా నిజంగా చెప్పగలరా? లేదు! 10అన్యాయపు తూనిక రాళ్లు, కొలతలు ఉపయోగించి ఇతరులను మోసం చేసే వాళ్లంటే యెహోవాకు అసహ్యం. 11ఒక బిడ్డ తాను చేసే పనుల మూలంగా తన మంచి లేక చెడు చూపిస్తుంది. ఆ బిడ్డను నీవు గమనించి నిజాయితీ, మంచితనం ఆ బిడ్డకు ఉన్నాయో లేదో నీవు తెలిసికోవచ్చు. 12మనకు చూసేందుకు కళ్లు, వినేందుకు చెవులు ఉన్నాయి. వాటిని మన కోసం యెహోవా చేశాడు! 13నీవు నిద్రను ప్రేమిస్తే, నీవు నిరుపేదవు అవుతావు. పనిచేసేందుకు నీ సమయాన్ని ఉపయోగించు. అప్పుడు నీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. 14“నీవద్ద ఏదైనా కొనే మనిషి, బాగుండలేదు! చాలా ఖరీదు ఉంది!” అని చెబుతాడు. తరువాత అతడు వెళ్లిపోయి, తాను ఒక మంచి వ్యవహారం చేసినట్టుగా ఇతరులతో చెప్పుకొంటాడు. 15జ్ఞానముగల విషయాలు చెప్పటం బంగారం కంటే, ముత్యాలకంటే చాలా ఎక్కువ విలువగలది. 16మరో మనిషి అప్పులకు నీవు బాధ్యత వహిస్తే నీవు నీ చొక్కా పోగొట్టుకొంటావు. 17దగాచేసి సంపాదించిన ఆహారము ఒక మనుష్యునికి తీపిగా వుంటుంది. కాని తర్వాత అతని నోరు మట్టితో నిండుతుంది. మోసం చేసి నీవు ఏదైనా సంపాదిస్తే అది మంచిదానిలా కనబడవచ్చు. కాని చివరికి దాని విలువ శూన్యం. 18నీవు పథకాలు వేయకముందు మంచి సలహా తీసికో. నీవు గనుక ఒక యుద్ధం ప్రారంభిస్తూంటే నిన్ను నడిపించేందుకు మంచి మనుష్యులను చూసుకో. 19ఇతరులను గూర్చి చెప్పుడు మాటలు చెప్పే మనిషి నమ్మదగిన వాడు కాడు. కనుక అధిక ప్రసంగం చేసే మనిషితో స్నేహంగా ఉండవద్దు. 20ఒక వ్యక్తి తన తల్లికిగాని తండ్రికిగాని విరోధముగా మాట్లాడితే, అప్పుడు ఆ వ్యక్తి చీకటిగా మారిపోతున్న వెలుగులా ఉంటాడు. 21నీ ఐశ్వర్యాన్ని నీవు తేలికగా సంపాదించి ఉంటే, అది నీకు ఎక్కువ విలువగలది కాదు. 22ఎవరైనా నీకు విరోధంగా ఏదైనా చేస్తే, నీ అంతట నీవే అతన్ని శిక్షించటానికి ప్రయత్నించకు. యెహోవా కోసం వేచి ఉండు. అంతంలో ఆయన నీకే విజయం ఇస్తాడు. 23అన్యాయపు త్రాసులు, తూనికలు ఉపయోగించి ఇతరులను మోసం చేసేవాళ్లంటే యెహోవాకు అసహ్యం. అవి ఆయన్ని సంతోషవరచవు. 24ప్రతి మనిషికీ ఏమి జరుగుతుంది. అనే విషయం నిర్ణయించేది యెహోవా, అలాంటప్పుడు ఎవరైనా సరే వారి జీవితంలో ఏమి జరుగుతుందో ఎలా గ్రహించగలరు? 25దేవునికి నీవు ఏదైనా ఇస్తానని వాగ్దానం చేయక ముందే జాగ్రత్తగా ఆలోచించుకో, తర్వాత అలాంటి వాగ్దానం చేసి ఉండకపోతే మంచిది అనిపించవచ్చు. 26ఏ మనుష్యులు దుర్మార్గులో జ్ఞానముగల రాజు నిర్ణయిస్తాడు. మరియు ఆ ప్రజలను ఆ రాజు శిక్షిస్తాడు. 27ఒక మనిషి అంతరంగంలో ఉండే విషయాలు తెలిసికొనే సమర్ధుడు యెహోవా. 28ఒక రాజు న్యాయంగా, నిజాయితీగా ఉంటే, అతడు తన అధికారాన్ని ఉంచుకోగలుగుతాడు. ప్రజలు అతన్ని ప్రేమిస్తే, అతడు తన పరిపాలన కొనసాగిస్తాడు. 29ఒక యువకుని బలాన్ని బట్టి మనం అతణ్ణి మెచ్చుకొంటాం. కానీ నెరసిన తలను చూచి ఒక వృద్ధుని మనం గౌరవిస్తాం అతడు పూర్ణ జీవితం జీవించినట్టు అది సూచిస్తుంది. 30మనం శిక్షించబడితే, మనం తప్పు చేయటం మానివేస్తాం. నొప్పి ఒక మనిషిని మార్చగలదు.

will be added

X\