మీకా 2

1పాపం చేయటానికి ఉపాయం పన్నేవారికి ఆపదలు వస్తాయి. ఆ ప్రజలు తమ పాన్పులపై పడుకొని పాపం చేయటానికి పథకాలు వేస్తారు. తెల్లవారగానే, ఈ ప్రజలు తమ పథకం ప్రకారం చెడు పనులు చేస్తారు. ఎందుకంటే వాటిని చేయటానికి వారికి శక్తిఉంది. 2వారు భూములను ఆశించి, వాటిని తీసుకుంటారు. వారు ఇండ్లును కోరి వాటిని ఆక్రమిస్తారు. వారొక వ్యక్తిని మోసపుచ్చి వాని ఇంటిని తీసుకుంటారు. వారొక వ్యక్తిని మోసగించి అతని వస్తువులను కాజేస్తారు. 3అందువల్ల యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “చూడండి, ఈ వంశం మీదికి ఆపద తీసుకురావటానికి నేను పథకం వేస్తున్నాను. మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. మీరు గర్వంగా నడవలేరు. ఎందకంటే అది కీడుమూడే సమయం. 4ఆ సమయంలో ప్రజలు మిమ్మల్ని గురించి పాటలు పాడుకుంటారు. ప్రజలు మిమ్మల్ని గురించి దుఃఖ సూచకపాటలు ఆలపిస్తారు. మీరు ఇలా అంటారు: ‘మేము నాశనమయ్యాము! యెహోవా నా ప్రజల భూమిని తీసుకున్నాడు. ఆయన దానిని అన్యజనులకు ఇచ్చాడు. అవును, నా భూమిని ఆయన నానుండి తీసుకున్నాడు. యెహోవా మా పొలాలను మా శత్రువులమధ్య విభజించాడు. 5ప్రజలు మీ భూమిని కొలవలేరు. భూమిని యెహోవా ప్రజల మధ్య విభజించటానికి ప్రజలు చీట్లు వేయలేరు. ఎందుకంటే, ఆ భూమి మీకు చెందియుండదు!’” 6ప్రజలు ఇలా అంటారు: “మాకు బోధించవద్దు. మా గురించి ఆ చెడు విషయాలు చెప్పవద్దు. మాకు ఏ కీడూ జరుగబోదు.” 7కాని, యాకోబు వంశీయులారా నేనీ విషయాలు చెప్పాలి. మీరు చేసిన పనుల పట్ల యెహోవా కోపగిస్తున్నాడు. మీరు ధర్మంగా ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని గురించి మంచి మాటలు చెప్పేవాడిని. 8కాని, ఇటీవల నా ప్రజలే నా శత్రువులయ్యారు దారిన పోయే వారివద్ద నుండి మీరు బట్టలు దొంగిలిస్తారు. ఆ జనులు మాత్రం సురక్షితంగా ఉన్నామనుకున్నారు. కాని వారు యుద్ధ ఖైదీలు అన్నట్లు, వారి వస్తువులు మీరు తీసుకుంటారు. 9నా ప్రజల స్త్రీలను వారి అందమైన, సౌకర్యాలు గల ఇండ్లనుండి మీరు వెళ్లగొట్టారు. వారి చిన్న పిల్లల మధ్యనుండి నా మహిమను మీరు తీసివేశారు. 10లేచి వెళ్లిపొండి! ఎందుకంటే, ఇది విశ్రాంతి తీసుకొనే స్థలం కాదు. ఎందుకంటే మీరు ఈ స్థలాన్ని పాడు చేశారు! మీరు దీన్ని అపవిత్రం చేశారు. కనుక అది నాశనం చేయబడుతుంది! 11ఒక బూటకపు ప్రవక్త వచ్చి, అబద్ధాలు చెప్పవచ్చు. అతడు, “నాకు ద్రాక్షారసం, మద్యం ఇవ్వండి. నేను మీకు మంచి విషయాలు చెపుతాను” అని అనవచ్చు. అతడు వారికి ఆ విధంగా బోధకుడవుతాడు! 12అవును, యాకోబు వంశీయులారా, నేను మీ అందరినీ ఒక్కచోటికి తీసుకువస్తాను. ఇశ్రాయేలు ప్రజలలో మిగిలిన వారందరినీ సమకూర్చుతాను. దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బీడులోనిమందల్లా, వారిని నేను సమకూర్చుతాను. అప్పుడు ఆ స్థలమంతా అనేకమందిచేసే ధ్వనులతో నిండిపోతుంది. 13“ఒక వ్యక్తి” ముందుకు తోసుకు వచ్చి తన ప్రజల ముందుకు వస్తాడు. ఆయన ద్వారాలను పడదోసుకుపోతాడు. ప్రజలు ఆ నగరాన్ని వదలివేస్తారు. వారి రాజు వారిముందు నడుస్తాడు. యెహోవా తన ప్రజల ముందు ఉంటాడు.

will be added

X\