యెషయా 61

1యెహోవా సేవకుడు చెబుతున్నాడు, నా ప్రభువు యెహోవా తన ఆత్మను నాలో ఉంచాడు. కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటానికి యెహోవా నన్ను ఏర్పరచుకొన్నాడు. పేద ప్రజలకు శుభవార్త ప్రకటించుటకు, దుఃఖంలో ఉన్న మనుష్యులను ఓదార్చుటకు, స్వాతంత్య్రంలేని ప్రజలకు స్వాతంత్య్రం ప్రకటించుటకు, బలహీన ప్రజలకు నూతన బలం ఇచ్చేందుకు, 2యెహోవా తన దయ చూపించే సమయాన్ని ప్రకటించేందుకు; దుష్టులను మన దేవుడు శిక్షించే సమయాన్ని ప్రకటించేందుకు; దుఃఖంలో ఉన్న వాళ్లను ఆదరించేందుకు; 3దుఃఖంలో ఉన్న సీయోను వాసులకు గౌరవం చేకూర్చేందుకు (ఇప్పుడు వారికి బూడిద మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు ఆనందతైలం ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు దేవుని స్తుతిగీతాలు ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది;) “మంచి వృక్షాలు” అని ఆ ప్రజలకు పేరు పెట్టుటకు; “యెహోవా అద్భుత చెట్టు” అని వారికి పేరు పెట్టుటకు. 4పాడు చేయబడిన పాత పట్టణాలు ఆ సమయంలో మరల నిర్మించబడతాయి. ఆ పట్టణాలు మొదట్లో ఉన్నట్టే మరల నూతనంగా చేయబడతాయి. ఎన్నెన్నో సంవత్సరాలుగా పాడు చేయబడిన ఆ పట్టణాలు కొత్తవాటిలా చేయబడతాయి. 5అప్పుడు మీ శత్రువులు మీ దగ్గరకు వచ్చి, మీ గొర్రెలను గూర్చి జాగ్రత్త వహిస్తారు. మీ శత్రువుల పిల్లలు మీ పొలాల్లోనూ, మీ తోటల్లోనూ పనిచేస్తారు. 6మీరు “యెహోవా యాజకులు” అని, “మన దేవుని సేవకులు” అని పిలువబడతారు. భూమి మీద ఉన్న రాజ్యాలన్నింటి నుండీ వచ్చిన ఐశ్వర్యాలు మీకు ఉంటాయి. అది మీకు ఉన్నందువల్ల మీరు గర్విస్తారు. 7గతంలో ఇతరులు మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని చెడ్డ మాటలు అన్నారు. ఏ ఇతర ప్రజల కంటెకూడా మీరు ఎక్కువగా అవమానించబడ్డారు. కనుక ఇతర ప్రజలకంటె రెండంతలు ఎక్కువగా మీరు మీ దేశంలో పొందుతారు. శాశ్వతంగా కొనసాగే సంతోషం మీకు లభిస్తుంది. 8ఎందుకు ఇలా జరగుతుంది? ఎందుకంటె, నేను యెహోవాను గనుక, న్యాయం అంతే నాకు ఇష్టం గనుక. దొంగతనం, సమస్త చెడుగు నాకు అసహ్యం. కనుక ప్రజలకు తగిన శిక్ష నేను ఇస్తాను. నా ప్రజలతో శాశ్వతంగా నేను ఒక ఒడంబడిక చేసుకొన్నాను. 9అన్ని రాజ్యాలలో ప్రతి ఒక్కరూ నా ప్రజలను తెలుసుకొంటారు. నా దేశం పిల్లలను ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. యెహోవా వారిని ఆశీర్వదించునని, వారిని చూచే ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. 10యెహోవా నన్ను ఎంతో ఎంతో సంతోషింపజేస్తాడు. నా దేవునియందు నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను. రక్షణ వస్త్రాలతో యెహోవా నన్ను కప్పాడు. ఆ వస్త్రాలు ఒకడు తన పెండ్లికి ధరించే వస్త్రాల్లా ఉన్నాయి. దయ అనే పైబట్టతో యెహోవా నన్ను కప్పాడు. ఈ పైబట్ట ఒక స్త్రీ తన పెండ్లికి ధరించే అందమైన వస్త్రాల్లా ఉంది. 11భూమి మొక్కలను మొలిపిస్తుంది. ప్రజలు తోటలో విత్తనాలు చల్లుతారు. ఆ తోట ఆ విత్తనాలను ఎదిగింపజేస్తుంది. అదే విధంగా యెహోవా దయను ఎదిగింప జేస్తాడు. సకల రాజ్యాలలో యెహోవా స్తుతిని ఎదిగింప జేస్తాడు.


Copyright
Learn More

will be added

X\